NIMZ – జహీరాబాద్ కోసం భారీ ఎత్తున జరిగిన భూసేకరణ, తప్పుడు ప్రజావిచారణలను పునఃసమీక్షించాలి: రైతులు, ప్రభావిత ప్రజలు, కార్యకర్తలు, శాస్త్రవేత్తలు లేవనెత్తిన సమస్యలను పరిగణలోకి తీసుకోవాలి.
18 ఫిబ్రవరి, 2021: జహీరాబాద్ నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ (NIMZ) కోసం అనుచితంగా జరిగిన భూసేకరణకు విరుద్ధంగా అసమ్మతి వ్యక్తపరుస్తున్న రైతులు, ప్రభావిత ప్రజానీకం పై రోజురోజుకి పెరుగుతున్న పోలీసు హింసకు NAPM ఆందోళన చెందుతోంది. జనవరి 20న (బర్దిపూర్), జహీరాబాద్ లో పర్యావరణ అనుమతికోసం జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు తమఅభిప్రాయాలను, సమస్యలను వ్యక్తపరచనీయకుండా పోలీసులు అణచివేత చర్యలకు పాల్పడి నిర్బంధం విధించారు. ఇది పర్యావరణ, సామాజిక ప్రభావాలను నిర్లక్ష్యం చేసే ఓ సుధీర్ఘమైన పరంపరలో భాగంగానే జరిగింది. అదే విధంగా మరెన్నో పర్యావరణ, భూసేకరణ నియమాలను అతిక్రమించటం కూడా జరిగింది.
దాదాపు 17 గ్రామాల్లో, 12,635 ఎకరాల భూసేకరణను నిర్దేశిస్తూ, వేలామంది రైతులు, వ్యవసాయ కూలీలలను, ముఖ్యంగా మహిళలను, వారి జీవనోపాధుల నుండి తొలగించే NIMZ వంటి విస్తృతమైన, అతిపెద్ద పర్యావరణ పరంగా వివాదాస్పదమైన ప్రాజెక్ట్ ను అమలు చేయడానికి ముందు పలు కోణాల నుండి సమగ్రమైన సమీక్ష, ప్రజాభిప్రాయ సేకరణ అత్యవసరం. బలవంతపు భూసేకరణను, ప్రాజెక్ట్ అమలును నిలిపివేయవలసిందిగా మేము తెలంగాణా ప్రభుత్వాన్ని మరియు కేంద్రాన్ని కోరుతున్నాము; ప్రజలు లేవనెత్తిన అన్ని ప్రశార్ధకమైన అంశాల పైన, స్థానిక సముహాలు, జీవావరణం పైన, ప్రాజెక్ట్ కలిగించే దీర్ఘకాలిక ప్రభావాల పైన దృష్టి సారించవలసిందిగా కోరుతున్నాము.
పర్యావరణ అనుమతికోసం జరిగిన ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకున్న పోలీసులు: 20 జనవరి, 2021:
జహీరాబాద్ NIMZ కు పర్యావరణ అనుమతికోసం జరగవలసిన ప్రజాభిప్రాయ సేకరణ (Public Hearing) 2020, జులై లో జరగవలసి ఉండగా, కోవిడ్ కారణంగా, తెలంగాణా హైకోర్టు తీర్పు మేరకు అది వాయిదా వేయబడింది. అప్పటికే భూసేకరణ ప్రతిపాదనపై ప్రజలు వ్యతిరేకత తెలియజేసారు. ఆ సమయంలో వచ్చిన కోర్టు తీర్పు ప్రజలకు కొంతైనా ఊరటనిచ్చింది. ఎట్టకేలకు జిల్లా అధికారయంత్రాంగం జనవరి 20, 2021 న బర్దిపూర్ లో ప్రజాభిప్రాయ సేకరణను ఏర్పాటుచేసింది. ఆరోజు ప్రజాభిప్రాయసేకరణ జరగవలసిన ప్రదేశంలో 1000కి మించి పోలీసులు ఉన్నారు. విచారణకు హాజరవుతున్న గ్రామస్తులను దారిపోడుగునా ఏర్పాటు చేసిన బారికేడ్ల వద్ద ఆపేశారు, ప్రజలు తమ వ్యతిరేకతను, అభిప్రాయాన్ని ప్రకటించటానికి వీలు లేకుండా చేశారు.
NIMZకి వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేయడం మొదలుపెట్టినప్పుడు, పోలీసులు ప్రజల పైన, ముఖ్యంగా మహిళలపైన బలప్రయోగం చేసినట్లుఅనేక నివేదికలు తెలియ చేస్తున్నాయి. ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన రోజున దాదాపు 100 మంది నిరసనకారుల్ని పోలీసులుఅదుపులోకి తీసుకుని, ఇద్దర్ని అరెస్ట్ చేసి వారిని తర్వాత విడుదల చేసారు. ప్రతి ప్రజా విచారణలో పోలీసుల ఇంత పెద్ద సంఖ్యలో హాజరవటం రివాజుగా మారింది. NIMZ పర్యావరణ అనుమతి విషయంలో కూడా ప్రజా వ్యతిరేకతను అడ్డుకుని, అనుమతి పొందే క్రమాన్ని త్వరితపరచడమే వారి ఉద్దేశం.
NIMZ జహిరాబాద్ ప్రాజెక్టుకి సంబంధించిన వివరాలు:
దేశ వ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రణాళికలో భాగంగా మంజూరు చేసిన నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మాన్యుఫాక్చరింగ్ జోన్‌లలో ఒకటి జహిరాబాద్ NIMZ. డిసెంబర్ 2015న దీనికి ఆమోదం లభించింది. ఇది నేషనల్ మేనుఫాక్చరింగ్ పాలసీ (2011)ను నెరవేర్చటానికి కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఇండస్ట్రీయల్ పాలిసి అండ్ ప్రమోషన్ విభాగంగా పనిచేస్తుంది. ఇది భారీ పారిశ్రామిక “గ్రీన్ ఫీల్డ్ -టౌన్ షిప్” గా ఎదిగి ‘ప్రపంచస్థాయి తయారీ-ఉత్పాదనను ‘ ప్రోత్సాహించటానికి ఉద్దేశింపబడినది.
తెలంగాణా ప్రభుత్వ యాజమాన్యంలోని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ (TSIIC) SPV జహీరాబాద్ NIMZ Ltd. ద్వారా NIMZ జహీరాబాద్ ను చేపట్టింది. పర్యావరణ ప్రభావ అంచనా (EIA)నివేదికలో NIMZ జహీరాబాద్ వార్షిక పారిశ్రామిక పెట్టుబడికి 44,000 కోట్ల రూపాయలు సహాయం మరియు 2040 నాటికి 2.66 లక్షల ఉద్యోగ అవకాశాలను మంజూరు చేసేవిధంగా వాగ్దానం చేసింది. అలాగే NIMZ ఏర్పాటు స్థానిక మౌలిక సదుపాయాల కల్పన – రోడ్డు రైలు మార్గాల రవాణా మెరుగుపరచటంతో పాటు, సాంప్రదాయ పరిశ్రమలకు చేయూతనిస్తూ, ఆధునిక పరిశ్రమల స్థాపనలో తోడ్పడటం ద్వారా తూర్పు-పడమర వాణిజ్యానికి దోహదం చేస్తున్నట్లు చెబుతున్నది.
దీన్ని ఏర్పాటు చేయటానికి NIMZ కు 12,635 ఎకరాల భూమిని కేటాయించారు. అందులో 8,773 ఎకరాలు పట్టా భూములు, 3,862 ఎకరాలు అసైన్డు భూములు. ఈ భూములు జాహిరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన న్యాల్కల్ (14) మరియు ఝరాసంగం (3) మండలాలలోని 14 గ్రామాలలోనివి. ఎక్కువ శాతం చిన్న రైతులు, దళితులకు చెందిన భూములు. సంగారెడ్డి ప్రాంతంలో NIMZ వస్తే భవిష్యత్తు పెట్టుబడులు, వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయని గుర్తించినప్పటికీ, ఇప్పుడు సేకరించిన భూమి ఏంతో సారవంతమైనది. సంవత్సరానికి మూడు పంటల చొప్పున, చెఱకు, అల్లము, పసుపు, మామిడి, జామ, గంధపుచెక్క, ఆకుకూరలు మొదలైన వాణిజ్య పంటలు పండుతాయి. అలాంటి భూమిని స్వాదినపరుచుకోవటం వల్ల ఇక్కడి ప్రజల జీవనోపాధిపైన దెబ్బ పడుతుంది. 2015-2016 మధ్య కాలంలో జాహిరాబాద్ SPV NIMZ కు 2900 ఎకరాల భూమిని సేకరించారు.
NIMZ జహీరాబాద్ ప్రాజెక్ట్ కుసంబంధించి అభ్యంతరకరమైన అంశాలు:
తెలంగాణలో వ్యాపారానికి మౌలిక సదుపాయాలు మరియు ప్రోత్సాహకాలను అందించే లక్ష్యాలతో పాటు ఆర్థిక ప్రయోజనాలు మరియు ఉపాధి కల్పన దీని ఉద్దేశంగా నొక్కిచెప్పబడినప్పటికీ, ప్రస్తుత అంచనా ప్రకారం తక్కువలో తక్కువ 5,000 మంది రైతులను, 10,000 మంది స్థానిక ప్రజలను ఈ ప్రాజెక్ట్ ప్రత్యక్షంగా ప్రభావితం చేయగలదు. వాస్తవ దీర్ఘకాలిక ప్రభావం ప్రాజెక్ట్-ప్రభావిత వ్యక్తుల సంఖ్యను గణనీయంగా పెంచగలదు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్ పై వేర్వేరు వివాదాస్పద అంశాలు లేవనెత్తబడుతున్నప్పటికీ, వాటిలో ఏదీ పరిష్కరించబడకపోగా, అవన్నీ ఉద్దేశపూర్వకంగా అణచివేయబడ్డాయి.
(i) పొట్టకూటి కోసం పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడిన చిన్న రైతులు మరియు షెడ్యూల్డ్ తెగలకు చెందిన ప్రజల నుండి బలవంతంగా భూమిని స్వాధీనం చేసుకోవడం, వారు మొదటి నుండి నిరసన తెలపడానికి ఒక కారణం.
2017 డిసెంబర్ నాటికే, బలవంతంగా తమ భూముల నుండి తొలగించబడిన ప్రజలు, తమ జీవనోపాధిభద్రత, సరైన నష్టపరిహారం కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. జూన్ 2020 నాటికి, పర్యావరణ ప్రభావ అంచనా (EIA) లో భాగంగా సామాజిక-ఆర్థిక సర్వే నిర్వహించాల్సి ఉండగా, దీనిని ప్రతిపాదించిన మూడు గ్రామాలలో రెండింటిలో స్థానిక ప్రజలు వ్యతిరేకత వ్యక్తంచేసి, సర్వే జరగకుండా అడ్డుకున్నారు. మిగిలిన ఒక గ్రామంలో సర్వే జరిగింది కానీ పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడిన ప్రజలు 70% వరకు నిమ్జ్ ఏర్పాటుకు విముఖంగా ఉన్నట్టు సర్వే ఫలితాలు సూచించాయి.
ఈ క్రమంలో భూసేకరణకు మద్దతుగా EIA తీసుకువచ్చిన వాదన ఏమిటంటే, ఇక్కడివన్నీ వ్యవసాయ భూములైనప్పటికీ, అంచనా బృందం సందర్శించిన సమయంలో అవి ‘బీడుగా పడున్నాయని’. జనవరి 2021 లో, ఎన్విరాన్‌మెంటల్ అనుమతి కోసం జరిగిన బహిరంగ విచారణలో, అప్పటికే భూమిని కోల్పోయిన ప్రజలు దానిపై తమ ఆందోళనను వ్యక్తం చేశారు. ఇతర స్థానిక ప్రజలు తమ గ్రామాలలో మిగిలి ఉన్న భూముల్ని కొనుగోలు చేసి, వ్యవసాయేతర ప్రయోజనాల కోసం మళ్లించవద్దని కోరుతూ సమావేశంలో పాల్గొనదలిచారు. కానీ పోలీసులు వారిని తమ సమస్యలను వ్యక్తపరచకుండా అడ్డుకున్నారు.
(ii) మహిళా రైతులపై ప్రభావం. ఇక్కడి మహిళా రైతులు ప్రాధమిక ఆదాయ వనరుగా వ్యవసాయంపై ఆధారపడినప్పటికీ, భూమి పట్టాలు సాధారణంగా వారి పేర్లలో ఉండవు. మొదటనుండే, వారు ప్రభుత్వము మరియు పురుషులు మాత్రమే నిర్ణయకర్తలుగా ఉండి ‘భూఆక్రమణ’ మరియు ‘భూ సేకరణ’ జరిగే అవకాశాన్ని గ్రహించారు, ప్రధాన వాటాదారులుగా ఉన్న పురుషుల్ని ఎకరానికి 5 లక్షల రూపాయల చొప్పున తక్కువ పరిహారం ముట్టచెప్పి, నిమ్జ్ వచ్చిన తరువాత ఉద్యోగాల వాగ్దానాలు ఎరగా చూపించి భూమిని వదులుకోవడానికి ఒప్పించడం/ మోసగించడం పెద్ద కష్టమైనా పనేమీ కాదు. వ్యవసాయ భూముల్ని కోల్పోవడం అనేది మహిళల జీవితాలపై ఆర్థికంగా, సామాజికంగా క్రూరమైన ప్రభావాన్ని చూపుతుంది.
దశాబ్దాలుగా భూమిని సాగు చేస్తూ, సంఘాలుగా ఏర్పడిన ఇక్కడి గ్రామాల్లోని మహిళల సమిష్టి శక్తిని, సంఘాల వ్యవస్థను NIMZ రాక నిర్వీర్యం చేయగలదు. వాస్తవానికి, 4 సంవత్సరాల క్రితం, ఆగస్టు, 2016 లో, బర్డిపూర్ కి చెందిన భూమిలేని NIMZ-ప్రభావిత మహిళా రైతులు అలిగే తుక్కమ్మ, జయమ్మ తదితరులు హైకోర్టును ఆశ్రయించి, భూసేకరణ మరియు పునరావాస చట్టం, 2013 లోని నిబంధనలను ఉల్లంఘించిన వివాదాస్పద GO MS No. 123 ప్రకారం పెద్ద ఎత్తున జరుగుతున్న భూ సేకరణ ముందుకు సాగకుండా, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరోధించేవిధంగా స్టే ఉత్తర్వులను పొందడంలో కీలక పాత్ర పోషించారు.
(iii) అనుచితమైన, అతితక్కువ భూపరిహారం కూడా ఆందోళన కలిగించే విషయమే. NIMZ కోసం ప్రణాళికలను ఆమోదించిన తరువాత, ఈ ప్రాంతంలో భూమి ధరలు పెరిగి, దాదాపు ఎకరానికి 25-30 లక్షల రూపాయల వరకు చేరుకోగా, భూసేకరణ క్రమంలో మాత్రం యజమానులకు ఎకరానికి 7-8 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందజేయబడుతున్నది. ఈ డబ్బు మొత్తంతో వేరే ఎక్కడైనా ప్రత్యామ్నాయ వ్యవసాయ భూములను కొనడం అసాధ్యం. భూయజమానులతో ఒప్పందం కుదిరితే, భూసేకరణ చట్టం 2013 ప్రకారం, అత్యంత సారవంతమైన వ్యవసాయ భూమిని కోల్పోయినందుకు గాను వారికీ న్యాయంగా నష్టపరిహారం అందచేయాలి.
(iv) కాలుష్య ప్రమాదాలను సరిగా, పూర్తిగా అంచనా వేయలేదని EIA నివేదికను సమగ్రంగా విశ్లేషించిన ‘సైంటిస్ట్స్ ఫర్ పీపుల్’ శాస్త్రవేత్తల బృందం, విచారణకు ముందే MoEFCC కి ఒక పిటిషన్‌లో దాఖలు చేసారు. కాలుష్య భారం గురించి కల్పిత గణాంకాలను సమర్పించినందుకు, అత్యధిక స్థాయిలో కాలుష్యానికి దోహదం చేసే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను అంచనాలో భాగం చేయకపోవడానికి గాను వారు EIA నివేదికను తిరస్కరించాలని కోరారు.
భూమి, నీరు, గాలి తీవ్రంగా కలుషితమై పోయి తమపై ప్రభావం పడుతుందని బాధిత గ్రామాల, పొరుగు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పర్యావరణాన్ని కలుషితం చేసే NIMZ సంబంధిత పరిశ్రమలు ఏర్పాటు చేయరాదని వీరు డిమాండ్ చేస్తున్నారు. NIMZ కోసం కేటాయించిన 5 కిలోమీటర్ల ప్రాంతంలో నాలుగు రిజర్వు అడవులు ఉన్నాయన్నది గుర్తించుకోవాలి.
(v) EIA నివేదికలో సూచించినట్లు స్థానిక ప్రజలను NIMZ లో నైపుణ్యం లేని కార్మికులుగా (Unskilled Labour) నియమించే అవకాశం ఉంది. ఇందువల్ల భూసేకరణ కారణంగా నిర్వాసితులయినవారి జీవితాలు మరింత అతలాకుతలమవుతాయి. ఉపాధి హామీ, యువతకు నైపుణ్య శిక్షణ, ముసలివారికి, మహిళలకు జీవనోపాధి భద్రత వంటి ప్రతిపాదనలు ఏవీ దీనిలో చేయబడలేదు.
ఇప్పటికే చాలా కాలంగా NIMZ కు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతూ వస్తున్నాయి. NIMZ రైతుల పోరాట సమితి నిర్వహిస్తూన్న ఈ నిరసనలకు ప్రజాస్వామ్య సంస్థలు, రాష్ట్రంలోని కొన్ని ప్రతిపక్ష పార్టీలు మద్దతుగా ఉన్నాయి.
తమ జీవనాధారానికి మాత్రమే కాక పర్యావరణ చైతన్యంతో తగిన వ్యవసాయ పద్ధతులను ఆవలంబిస్తున్న రైతుల, వ్యవసాయ కార్మికుల, షెడ్యూల్డ్ తెగల జీవితాల పట్ల రాజ్యం మరియు పారిశ్రామిక లాబీలు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ప్రజాఉద్యమాల జాతీయ వేదిక (NAPM ) ఖండిస్తోంది.
ప్రజా విచారణకు సిద్ధమవుతున్న రైతుల, బాధిత గ్రామస్తుల, పర్యావరణ కార్యకర్తల డిమాండ్లతో మేము ఏకీభవిస్తున్నాము. వారి ఆందోళనలను, ఆలోచనలను ను పంచుకుంటున్నాము.
మా డిమాండ్లు :
- వివాదాస్పదమైన Go.MS.No.123 ద్వారా, లేదా తెలంగాణ స్టేట్ LARR (సవరణ) చట్టం 2017 ద్వారా NIMZ ప్రాజెక్ట్ కోసం ఇప్పటివరకు చేపట్టిన భూసేకరణను రద్దు చేయాలి. 2006 SEC 371, 2020 SEC online SC 1005 లోని సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పర్యావరణ అనుమతి లేకుండా జరిగిన భూసేకరణ చట్టవిరుద్ధం. ఇదివరకు స్వాధీనం చేసుకున్న భూములన్నీ వాటి యజమానులకు తిరిగిచ్చేయాలి, మధ్యంతర కాలానికి పరిహారం కట్టాలి.
- భూ సేకరణ, పురవాసం, పునరాశ్రయ చట్టం, 2013, EIA నోటిఫికేషన్, 2006 మేరకు విధానాలనూ, భద్రతనూ ఉల్లంఘిస్తూ, ప్రజా సంప్రదింపులు లేకుండా జరిగే భూసేకరణను ఇకపై ఆపివేయాలి.
- ప్రజా విచారణ సమయంలో శాంతియుతంగా నిరసనను తెలియజేసిన ప్రజలపై పోలీసుబలగాన్ని ఉపయోగించడం గురించి దర్యాప్తు చేయాలి. పెద్ద ఎత్తున పోలీసులను మొహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి.
ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరికేదాకా, పర్యావరణ ప్రభావ అంచనా (EIA) ప్రక్రియలో ఎత్తి చూపిన అవకతవకలపై, అసమానతలపై ఓ స్వతంత్ర దర్యాప్తు జరిగే దాకా భూసేకరణను నిలిపివేయాలి. పర్యావరణ, సామాజిక ప్రభావాలను అంచనా వేయకుండా తెలంగాణ రాష్త్ర కాలుష్య నియంత్రణ బోర్డు (TNSPCB), నిపుణుల అంచనా కమిటీ, పర్యావరణ అడవుల మంత్రిత్వ శాఖ (MoEF&CC) ఈ ప్రాజెక్ట్ కు అనుమతిని ఇచ్చే తొందరలో ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదు.

వివరాలకు సంప్రదించండి: napmindia@gmail.com