విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ, ఆంధ్రలో భారీ నిరసనలకు NAPM మద్దతు తెలుపుతోంది
25 ఫిబ్రవరి, 2021: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (వి.ఎస్.పి)ని ప్రైవేటీకరించాలన్న కార్పొరేట్- అనుకూల, ‘పెట్టుబడి ఉపసంహరణ’ అని తప్పుగా పిలువబడుతున్న కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలలో ఉద్యోగులు మరియు కార్మికులకు ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక సంఘీభావం ప్రకటిస్తోంది. వి.ఎస్.పి గా పిలువబడే రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ (RINL) యొక్క ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గత కొన్ని వారాలుగా, ఈ పోరాటానికి విశాఖపట్నం మరియు ఆంధ్రప్రదేశ్‌లోని కార్మిక సంఘాలు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాస్వామ్య సమూహాలు, మేధావులు మరియు కొన్ని రాజకీయ పార్టీలు సహా అన్ని వర్గాల నుండి విస్తృత మద్దతు లభించింది.
22,000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వి.ఎస్.పి మొత్తం 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తులను కలిగి ఉంది. ఈ ప్లాంటులో 15,000 మంది శాశ్వత, 20,000 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. అదనంగా, ఇది పరోక్షంగా 65,000 మందికి ఉపాధి కల్పిస్తున్నందున, మొత్తంగా లక్ష మందికి పైగా జీవనోపాధి లభిస్తుంది. RINL లో పెట్టుబడులను సూత్రప్రాయంగా 100% ఉపసంహరించుకోవాలని ఆమోదిస్తూ కేంద్ర కేబినెట్ ఇటీవల చేసిన నిర్ణయం, ఈ లక్ష మంది కార్మికులపై క్రూరమైన ప్రభావం చూపుతుంది. మొత్తంగా, ప్రజల యొక్క ఘనమైన పోరాటం మరియు త్యాగం తర్వాత స్థాపించబడిన, దేశం యొక్క మొట్టమొదటి తీర-ఆధారిత ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ శక్తులకు అమ్మడం దీని అర్థం.
దాదాపు 5 దశాబ్దాల క్రితం, 1977 లో, అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పదవీకాలంలో, సుదీర్ఘ పోరాటం మరియు ఆందోళనల తరువాత, ఉక్కు కర్మాగారం స్థాపించబడింది. అప్పట్లో, కార్మికులు, మేధావులు, స్వాతంత్ర్య సమరయోధులు ఈ ప్లాంటును స్థాపించాలని పట్టు పట్టడంతో “విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు” అనే నినాదం ప్రతిధ్వనించింది. 60 వ దశకంలో జరిగిన ఈ తీవ్రమైన పోరాటంలో క్రూరమైన పోలీసు కాల్పుల కారణంగా 32 మంది సహా, చాలా మంది మరణించారు. ఈ మరణాలు, అలాగే ప్లాంట్ కోసం ఖాళీ చేయించబడిన 44 గ్రామాలు, దేశం కోసం ఒక కీలక సంపద నిర్మాణంలో ప్రజలు చేసిన త్యాగాలు.
వి.ఎస్.పిని ప్రైవేటీకరించడానికి గల ముఖ్యకారణాలు అది నష్టాల బాటలో నడుస్తుండటం అయితే, స్టీల్ ప్లాంట్లో 100% వాటాను కలిగి ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం నామమాత్రపు పెట్టుబడులు మాత్రమే పెట్టిందనే విషయాన్ని గుర్తించాలి. స్థాపించబడిన తరువాతి దశాబ్దాలలో మరియు ముఖ్యంగా 90 ల తరువాత, నయా ఉదారవాద రాష్ట్ర విధానం వల్ల ప్లాంట్ యొక్క ఉత్పత్తి ఖర్చులు గణనీయంగా పెరుగుతూ పోయాయి.
భారీ ప్రభుత్వ రంగ సంస్థ అయినప్పటికీ, టాటా, మిట్టల్ మరియు అదానీ వంటి మెగా ప్రైవేట్ రంగ ఆటగాళ్లకు ఇనుము గనులను కేటాయించడంలో వెనుకాడని ప్రభుత్వం, వి.ఎస్.పికి గనులను కేటాయించలేదు. పర్యవసానంగా, ప్లాంట్ ముడిసరుకును సేకరించడానికి ఏటా 1,500 నుండి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయవలసి వస్తుంది. గనుల లభ్యత లేకపోవడంతో, గనుల తవ్వకానికి మరియు ధాతువును ప్రాసెస్ చేయటానికి VSP కి దాదాపు ప్రతి టన్నుకి 5 నుండి 6 రెట్లు అధికంగా ఖర్చవుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ప్లాంట్ ఎదుర్కొనే అధిక సరుకు రవాణా ఖర్చులు, పారిశ్రామిక విద్యుత్ సుంకాలు వంటి ఇతర అధిక ఇన్పుట్ ఖర్చులు ప్రైవేటీకరణ ద్వారా పరిష్కరించబడవు.
అంతేకాకుండా, ప్రారంభ దశలో జరిగిన నిర్మాణంలోని జాప్యాలు రుణాలపై గణనీయమైన నష్టాన్ని కలిగించాయి; 2000 లో పునర్నిర్మాణ ప్యాకేజీ ద్వారా మాత్రమే ఇవి పరిష్కరించబడ్డాయి. 2001 నుండి 2016 వరకు, ప్లాంట్ లాభాలను ఆర్జించింది. వరుస ప్రభుత్వాల స్పష్టమైన నిర్లక్ష్య వైఖరి వి.ఎస్.పి కార్యకలాపాలకు గొప్ప భంగం కలిగించినప్పటికీ, ఈ ప్లాంట్ సంవత్సరాల తరబడి మంచి పనితీరును కనబరిచి, ఆధునీకరణ మరియు సామర్థ్య విస్తరణను కూడా 2016 లో ప్రారంభించింది. ప్లాంట్ విస్తరణకు కేంద్రం ఎటువంటి నిధులు ఇవ్వకపోవడంతో, వి.ఎస్.పి మరోసారి దాని కోసం అప్పులు చేయవలసి వచ్చింది. అన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ, ప్లాంట్ కొంతైనా సంతృప్తికరమైన ఉత్పత్తితో ఉనికిలో ఉండటం, తగినంత రాష్ట్ర మద్దతు లభిస్తే ప్రభుత్వ రంగ సంస్థలు (పి.ఎస్.యు.లు) వృద్ధి చెంది, ప్రజా ప్రయోజనాలను నెరవేరుస్తూ, రాష్ట్ర ఖజానాకు సమకూర్చగలవనే సత్యానికి నిదర్శనం.
VSP యొక్క ప్రైవేటీకరణ అనేది బిజెపి నేతృత్వంలోని భారత ప్రభుత్వ కార్యాచరణలో- ప్రభుత్వ సంస్థలను స్వప్రయోజనపరులైన ప్రైవేటు ఆటగాళ్లకు అమ్ముతూ, ప్రజాప్రయోజనాలను పణంగా పెట్టి వారి ప్రయోజనాలను నేరవేర్చడమనే – వేళ్ళూనుకున్న ధోరణిలో భాగం మాత్రమే. మోడీ ప్రభుత్వానికి, కార్పొరేట్ కులీనులకు మధ్య ఉన్న ఈ అనుబంధం ప్రభుత్వం ‘ఆత్మనిర్భర్ భారత్’ ఎజెండాను ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తూ, భారత ప్రజలు, ప్రభుత్వ రంగం పట్ల ఉన్న అన్ని బాధ్యతలను వదులుకుంటున్న తరుణంలో స్పష్టంగా వ్యక్తమవుతుంది. ప్రస్తుత మహమ్మారి పరిస్థితులలో ఇది ఆర్థిక పునరుద్ధరణ వైపు అవాంచిత చర్య అని విశ్లేషణలు నిర్ధారించినప్పటికీ, ప్రభుత్వం అటువంటి ప్రజా ఆస్తులను అత్యధిక ధర చెల్లించే కొనుగోలుదారులకు అమ్మడం కొనసాగిస్తోంది.
వి.ఎస్.పి పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని, దానిపై ఆధారపడిన లక్ష మందికి పైగా ప్రజల జీవితాలను, జీవనోపాధిని మరింత త్యాగం చేయడంలోని నిర్దయతను ఎన్.ఎ.పి.ఎం. ఖండిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం నుండి మేము కోరే డిమాండ్లు:
- వి.ఎస్.పిని ప్రైవేటీకరించాలన్న ఏకపక్ష మరియు ప్రజా-వ్యతిరేక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకొవాలి.
- జీవనోపాధిని కాపాడాలి,1 లక్షల మంది కార్మికుల ఉపాధి హామీ కల్పించాలి.
- ఉత్పాదక వ్యయాలను తగ్గించడానికి, తగినంత బందీ గనులను కేటాయించండి.
రాష్ట్ర క్యాబినెట్ ప్రకటించినట్లు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ శాసన సభ బలమైన తీర్మానం చేస్తుందని మేము ఆశిస్తున్నాము. నిజమైన సమాఖ్య (federal) స్ఫూర్తితో, అటువంటి తీర్మానాన్ని మరియు RINL ను ప్రైవేటీకరించవద్దని ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తిని కేంద్రం గౌరవించాలి. శాంతియుతంగా సమ్మె చేస్తున్న ఉద్యోగులు మరియు నిరసనకారులపై బల ప్రయోగం నిరోధించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము.
మరిన్ని వివరాల కోసం, సంప్రదించండి: napmindia@gmail.com